Mahesh Thanks KTR: హైదరాబాద్ లో బిగ్ ఈవెంట్.. కేటీఆర్ కు మహేశ్ బాబు థ్యాంక్స్!

మహేశ్ బాబు (Mahesh Babu) తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

  • Written By:
  • Updated On - January 25, 2023 / 12:52 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఫార్ములా ‘ఈ-వరల్డ్ ఛాంపియన్‌షిప్’ ను  హైదరాబాద్‌కు తీసుకొచ్చినందకుగానూ మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవో, అనిల్ చలమశెట్టిలకు సూపర్ స్టార్ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశాడు. ఫిబ్రవరి 11 న జరగనున్న ఈ (E-World Championship)  కార్యక్రమం పట్ల ఉత్సాహంతో ఉన్నట్టు ఆనందం వ్యక్తం చేశాడు.

భారతదేశంలో తొలిసారిగా జరగనున్న ఫార్ములా  రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంలో వారి కృషిని కొనియాడారు. ‘‘(E-World Championship) ని హైదరాబాద్‌కు తీసుకువచ్చినందుకు కేటీఆర్, తెలంగాణ సీఎంవో కు అభినందనలు. ఫిబ్రవరి 11 కోసం ఎదురుచూస్తున్నాం! ఫార్ములా చాంపియన్ షిప్ హైదరాబాద్ (Hyderabad) లో జరగడం ఆనందంగా ఉంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఛాంపియన్ షిప్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  కలిసి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లోని ఐమాక్స్‌లో రేస్ ప్రారంభం కానుంది. FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ భారత్‌లో జరగడం ఇదే తొలిసారి.

ప్రపంచ స్థాయి నగరాల్లో నిర్వహించే ఫార్ములా రేసింగ్ ఈవెంట్స్ (E-World Championship)  ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ఇండియన్ రేసింగ్ లీగ్‌ (ఐఆర్ఎల్)కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌, మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ఫార్ములా ‘ఈ-వరల్డ్ ఛాంపియన్‌షిప్’ ఈవెంట్ జరుగనుంది. ఫిబ్రవరి 11న జరగనున్న దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం 227 కిలోమీటర్ల మేర జరుగనున్న రేసింగ్ ట్రాక్‌కు ఎఫ్ఐఏ లైన్ క్లియర్ చేసింది.

ఈ నేపథ్యంలో ఈ-వరల్డ్ ఛాంపియన్‌షిప్ టిక్కెట్లను తెలంగాణ (Telangana) స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేసింగ్ కోసం ప్రేక్షకులు నేటినుంచి ‘బుక్ మై షో’లో టికెట్లను కొనుగోలు చేయొచ్చని సూచించారు. మొత్తం 22,500 టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కేటగిరీల వారీగా టికెట్ రేట్లు (Price) ఉంటాయని తెలిపారు. రూ. 1,000, రూ.3,500, రూ.6,000 మరియు రూ.10,000గా టికెట్ల రేట్లను నిర్ణయించారని వివరించారు. 2023 హైదరాబాద్ ఈ-ప్రిక్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నట్లు అరవింద్ కుమార్ వెల్లడించారు.