Mahatma Gandhi : సత్యాగ్రహంతో యావత్ ప్రపంచాన్ని మేల్కొల్పిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి స్ఫూర్తినిస్తూ అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి(Mahatma Gandhi) సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. వారి చిత్రపటాలకు కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read :Israel Vs Iran : ప్రతీకారం కోసం రగిలిపోతున్న ఇజ్రాయెల్.. ఇరాన్‌లో ఏమేం చేయబోతోంది ?
‘‘సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని అక్కడి ప్రభుత్వం ఎలా ఆదరిస్తుందనే దాన్నిబట్టి దాని గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ మాటను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజంలోని బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ సర్కారు పేదల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలోని పేదలు బాధ పడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని నిర్మాణాత్మక పనులు చేయమని గెలిపించారు. కానీ మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలి’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘మా ప్రభుత్వం ఉండగా రెండున్నర లక్షల ఇళ్లను పేదల కోసం కట్టించింది. మీ ప్రభుత్వం కనీసం 5 లక్షల ఇళ్లను కట్టిస్తుందని పేదలు ఆశిస్తున్నారు. కానీ మీరు పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ గాంధీ జయంతి సందర్భంగానైనా ఢిల్లీలోని ప్రస్తుత గాంధీలు తెలంగాణ ప్రభుత్వ అమానవీయ పాలనపై స్పందించాలని కోరారు. డీపీఆర్ అనేది లేకుండా ఇళ్లను కూలగొట్టే దుర్మార్గమైన ప్రయత్నాలను విరమించుకోవాలని తెలంగాణ సర్కారును కేటీఆర్ కోరారు. మానవత్వంతో ముందడుగు వేయాలని సూచించారు.