Site icon HashtagU Telugu

Minister Seethakka: సకల సౌకర్యాలతో మహా మేడారం జాతర: మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: సకల సౌకర్యాలతో మహా మేడారం జాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. జాతర సమయానికల్లా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మేడారం మాస్టర్ ప్లాన్ అమలు

హైదరాబాద్‌లోని సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మేడారం మహా జాతర ఏర్పాట్లు, నిర్వహణ, మాస్టర్ ప్లాన్‌పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామాయర్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సహా పలువురు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. మంత్రులు సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనల మేరకు రూపొందించిన మేడారం దేవాలయ ప్రాంగణం నూతన డిజైన్‌ను పరిశీలించారు. భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యంగా డిజైన్‌లో అవసరమైన మార్పులపై చర్చించి, తగిన సూచనలు చేశారు.

Also Read: AP : మద్యం కేసు..వైసీపీ నేతల ఇళ్లలో సిట్‌ సోదాలు ముమ్మరం

భక్తుల సౌలభ్యంపై ప్రధాన దృష్టి

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారుల అభిప్రాయం మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచించారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకోడానికి వీలుగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో అమర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పూజారులు కోరినట్లుగా గద్దెల ఎత్తును పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జాతర సమయంలో భక్తులకు సహాయపడటానికి వాలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతున్నామన్నారు.

రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు

ఈ మహా జాతర కోసం రూ. 150 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇది మేడారం చరిత్రలోనే రికార్డు స్థాయి కేటాయింపు అని పేర్కొన్నారు. అవసరమైతే ఇతర శాఖల సహకారంతో అదనపు నిధులు కూడా కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జాతర ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను ముఖ్యమంత్రికి నివేదించిన తర్వాత పనులు వేగవంతం చేస్తామని సీతక్క చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ముందుకు వెళ్తామని, మేడారం అభివృద్ధి ప్రతి దశలో పూజారులను భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మల త్యాగం, ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందని తెలిపారు. మేడారం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలను కూడా అలంకరించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశం ద్వారా భక్తులందరికీ సౌకర్యవంతమైన వాతావరణంలో మహా మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు.