Site icon HashtagU Telugu

Hyderabad: ఒవైసీకి హిందుత్వంతో బీజేపీ చెక్ పెట్టనుందా?

Hyderabad

Hyderabad

Hyderabad: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ సహా 195 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది, అయితే ఈ జాబితాలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ఒవైసీపై బీజేపీ కొత్త వ్యూహాన్ని ప్రదర్శించింది. హిందుత్వాన్ని హైలైట్ చేస్తూ అసదుద్దీన్ పై మహిళను రంగంలోకి దించింది. ఒవైసీకి పోటీగా డాక్టర్ మాధవిలత బరిలోకి దిగుతుంది.

మాధవిలత తెలంగాణలోని విరించి హాస్పిటల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కొంతకాలంగా ఆమె హిందుత్వంపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హిందుత్వ భావజాలాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళుతున్నారు. ఆసుపత్రి చైర్‌పర్సన్‌గానే కాకుండా సామాజిక సేవలో కూడా చురుకుగా వ్యవహరిస్తారు. హిందూ మతానికి సంబంధించి మాధవి చేసిన ప్రసంగాలు ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశంగానే ఉన్నాయి. మాధవి లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ మరియు లతమా ఫౌండేషన్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు.

బీజేపీ నుంచి ఎన్నికల్లో టికెట్‌ రావడంపై మాధవిలత సంతోషం వ్యక్తం చేస్తూ ఒవైసీపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోక్ సభలో పరిశుభ్రత, విద్య, వైద్య సదుపాయాలు లేవన్నారు. మదర్సాలలో పిల్లలకు తిండి దొరకడం లేదని మాధవి అన్నారు. దేవాలయాలు, హిందువుల ఇళ్లు అక్రమంగా కబ్జాలకు గురవుతున్నాయని, వీటిని సరిచేయాలన్నారు.

తొలిసారిగా హైదరాబాద్ నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దించి సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. అంతకుముందు బీజేపీ భగవత్‌రావుకు అవకాశం కలపించింది. అయితే భగవత్ ఒవైసీ చేతిలో దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈసారి భాజపా మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా పోటీని కఠినతరం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఒవైసీని ఓడించడం అంత సులభం కాదంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. మరోవైపు ఓవైసీపై బీజేపీ వ్యూహం ఫలిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పెద్దలు. మరి ఒవైసీ కంచుకోటలో హిందుత్వ ముఖం విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: Vidisha Lok Sabha constituency: బీజేపీకి విదిశ లోక్‌సభ స్థానం ప్రత్యేకం ఎందుకు?

Exit mobile version