Site icon HashtagU Telugu

L&T Metro: కేంద్రానికి లేఖ రాసిన ఎల్ అండ్ టీ సంస్థ‌.. మెట్రో రైల్ నిర్వ‌హ‌ణ భారంగా మారింద‌ని!!

L&T Metro

L&T Metro

L&T Metro: లార్సెన్ అండ్ టూబ్రో (L&T Metro) సంస్థ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ నిర్వహణ భారంగా మారిందని, దానిని ప్రభుత్వాలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. గత కొన్ని సంవత్సరాలుగా మెట్రో ప్రాజెక్టును నడపడం తమకు ఆర్థికంగా నష్టదాయకంగా మారిందని, దీని వల్ల పేరుకుపోయిన అప్పులు, చెల్లింపులు సంస్థను ఒత్తిడికి గురిచేస్తున్నాయని చెబుతూ L&T కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో నిర్వహణను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది.

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టును నిర్మించి, నిర్వహించేందుకు L&T 2012లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టును ప్రైవేటు-పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) మోడల్‌లో 69 కిలోమీటర్ల పొడవున మూడు మార్గాల్లో నిర్మించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి అనుకున్నంత లాభాలు రాకపోవడం, కోవిడ్ సమయంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ప్రాజెక్టుకు రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ రైలు నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చుల వల్ల ఆదాయం సరిపోవడం లేదని L&T పేర్కొంది. ఈ ప్రాజెక్టులో నష్టాలు పేరుకుపోవడం వల్ల పెండింగ్‌లో ఉన్న రుణాలను తిరిగి చెల్లించడం కష్టమవుతోందని కంపెనీ తెలిపింది.

Also Read: Anushka: టాలీవుడ్ జేజ‌మ్మ అనుష్క సంచ‌ల‌న నిర్ణ‌యం!

పరిస్థితిని చక్కదిద్దడానికి, స్పెషల్ పర్పస్ వెహికిల్ (SPV)ను ఏర్పాటు చేయాలని L&T తన లేఖలో ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ SPV ద్వారా ప్రభుత్వాలు మెట్రో ప్రాజెక్టును నిర్వహిస్తే L&T కేవలం దానిలో ఒక భాగస్వామిగా కొనసాగడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రాజెక్టులోని అడ్వర్టైజింగ్‌, దుకాణాల లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నప్పటికీ నిర్వహణ ఖర్చులతో పోలిస్తే ఇది చాలా తక్కువని L&T వెల్లడించింది.

ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా పేర్కొంటూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరింది. ఒకవేళ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకోకుంటే, ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు L&T సంకేతాలు ఇచ్చింది. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎందుకంటే L&T నిర్ణయం హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఈ సమస్యపై ఎలా స్పందిస్తాయో, ఎటువంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.