MP Candidates: ఎల్లుండి రేవంత్ నేతృత్వంలో ఎంపీ అభ్యర్థి దరఖాస్తుల పరిశీలన

తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి 306 దరఖాస్తులు అందాయి

MP Candidates: తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి 306 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు శనివారం ఒక్కరోజే 166 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేశారు.

మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే సీనియర్ నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో వాళ్ల స్థానాల్లో వారి బంధువులు, సన్నిహితులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క సతీమణి నందిని, భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం డాక్టర్ రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, వరంగల్ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, మహబూబాబాద్ నుంచి విజయాభాయ్ తదితరులు ఉన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు టిక్కెట్టు ఆశించిన అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఫిబ్రవరి 6 మంగళవారం సమావేశం కానుంది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌మున్సీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, మహారాష్ట్ర ఎమ్మెల్యే విశ్వజీత్ కదమ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు తదితరులు పాల్గొంటారు.

Also Read: PK – CBN : చంద్రబాబు ‘బిహార్ డెకాయిట్’ కామెంట్.. పీకే రియాక్షన్ ఇదీ