మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ గేయ రచయిత రాసిన మాటలు అక్షర సత్యాలు అవుతున్నాయి. అచ్చం అలాంటి పరిస్థితే కీసర లో జరిగింది. కళ్ళముందు ప్రాణం పోతుంటే కాపాడడం మానేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తూ ఉండిపోయారు. దీంతో కళ్ళముందే అతడి ప్రాణాలు పోయాయి. ఈ ఘటన ఇప్పుడు అందర్నీ ఆవేదనకు గురి చేస్తుంది.
వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ నగరానికి చెందిన వి. ఏలేందర్ కీసర సమీప రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. ఏలేందర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిగా ఆయన రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు గమనించి కేకలు వేసేసరికి డ్రైవర్ లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో లారీ చక్రాలు ఎలేందర్ కాళ్లపై నుంచి వెళ్లి నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న ఏలేందర్.. తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డాడు. చుట్టూ పోగైన జనం తమ ఫోన్లతో వీడియో లు తీస్తున్నారు తప్పితే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచన చేయడంలేదు. 108కు సమాచారం అందించి బాధితుడి ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. కాసేపటికి 108 రాగా ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా బాధితుడు మృతి చెందాడు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి హాస్పటల్ కు తీసుకెళ్లండి..ప్లీజ్ నొప్పి భరించలేకపోతున్న అంటూ ఎంత ప్రాధేయపడినా చుట్టూ ఉన్న జనం సాయం చేయలేదు. 108 వాహనం వచ్చేవరకూ..అలాగే ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కాలం వెల్లబుచ్చారే కానీ ఓ నిండు ప్రాణాన్ని కాపాడాలన్న ఆలోచన వారిలో కలగలేదు. ఈ ఘటన చూసి ప్రతి ఒక్కరు అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Narendra Modi : గయానా ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను భారతదేశ ప్రజలకు అంకితం చేసిన మోదీ