Telangana – Rajya Sabha: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వీరే.. అధికారిక ప్రకటన నేడే

  • Written By:
  • Updated On - February 14, 2024 / 11:03 AM IST

Telangana – Rajya Sabha:  రేపటి(గురువారం)తో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది.  ఇప్పటికే అధిష్ఠానం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటా కింద కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన గురువారం హైదరాబాద్‌‌కు రానున్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రకు నిధుల సమీకరణకు అజయ్ మాకెన్ వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగతా రెండు  సీట్ల కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా ఒకటి ఓసీ సామాజికవర్గం, మరొకటి బీసీ లేదా ఎస్టీకి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంతోపాటు ఏఐసీసీ యోచిస్తోంది. అజయ్‌ మాకెన్‌ ఓసీ కావడంతో రాజ్యసభ(Telangana – Rajya Sabha) ఆశిస్తున్న జానారెడ్డి, చిన్నారెడ్డి, రేణుకా చౌదరిలకు అవకాశం లేనట్లేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

బీసీ, ఎస్టీ వర్గాల నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, వి. హనుమంత రావుతోపాటు జి.నిరంజన్‌ సహా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం వీహెచ్ అహర్నిశలు కష్టపడుతున్నట్లు భావిస్తున్న పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, అజారుద్దీన్‌లు కూడా పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని రాజ్యసభ సీటు వరిస్తుంది అనే దానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబులతో మాట్లాడిన తరువాత అభ్యర్థుల్ని ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులు.. గురువారం నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : Iran Attack : ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో ఇరాన్ ఎటాక్.. నిజమేనా ?

మూడు స్థానాలకు ముగ్గురు నామినేషన్‌ వేసినట్లయితే ఏకగ్రీవమవుతాయి. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈనెల 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల  పరిశీలన జరుగుతుంది. 20వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చేస్తారు. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నిక‌లు జరుగుతాయి. తెలంగాణ శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాల ప్రకారం చూస్తే రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు దక్కనున్నాయి. మొదట మూడు స్థానాలకు పోటీ చేయాలని భావించిన హస్తం పార్టీ.. ఆ తర్వాత రెండింటితోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.