KCR Delhi Tour: లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్.. ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం

కేసీఆర్ ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగినా.. ఆ ప్లాన్ కార్యరూపం దాల్చలేదు.

  • Written By:
  • Updated On - March 23, 2023 / 05:52 PM IST

కేసీఆర్ దాదాపు ప్రతినెలా ఢిల్లీలో పర్యటిస్తుంటారు. నిజానికి ఒక్క నెలలో రెండు సార్లు ఢిల్లీకి వెళ్లిన సందర్భాలున్నాయి. కానీ దాదాపు మూడు నెలలు కావస్తున్నా కేసీఆర్ ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటనకు ఆసక్తి చూపకపోవడం అటు తెలంగాణ, అటు ఢిల్లీలో ఆసక్తిగా మారింది. అయితే సీఎం కేసీఆర్ చివరిసారిగా డిసెంబరు 14న ఢిల్లీ పర్యటన వెళ్లారు. ఆ సమయంలో నాయకులు, కార్యకర్తల మధ్యన BRS పార్టీ కార్యాలయాన్ని  ఘనంగా ప్రారంభించారు.

ఇది జరిగిన వెంటనే ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి రావడంతో కేసీఆర్ కూతురు కవిత కల్వకుంట్ల పేరు మారుమోగింది. అప్పటి నుంచి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లలేదు. కేసీఆర్ ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగినా.. ఆ ప్లాన్ కార్యరూపం దాల్చలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంటరాగేషన్‌కు కవిత హాజరైన సమయంలో కేసీఆర్ కూడా పక్కన లేరు. కేవలం కేటీఆర్, హారీశ్ రావు, ఇతర మంత్రులు మాత్రమే ఉన్నారు.  ఈ మూడు పర్యాయాలు కొందరు మంత్రులను పంపినా కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లకూడదని నిర్ణయించుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట.

ఢిల్లీ మద్యం కుంభకోణంపై జాతీయ మీడియాను ఎదుర్కొని, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదని కేసీఆర్ ఢిల్లీకి వెళ్లలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కవిత ఇంటరాగేషన్ ఎదుర్కొన్నప్పుడు ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ తన సీనియర్ మంత్రులను కూడా ఆదేశించారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్.. కొందరు మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉండడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.