TS Liquor Sale: తెలంగాణలో రేట్లు పెరిగినా తగ్గని మద్యం అమ్మకాలు.. ఒక్క నెలలోనే రూ.530 కోట్ల ఎక్స్ ట్రా బిజినెస్

ప్రభుత్వానికి ఆదాయాన్ని అందివ్వడంలో మందుబాబులకు తిరుగే లేదు. అలాంటి ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వానికి కూడా దొరకరు.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 01:34 PM IST

ప్రభుత్వానికి ఆదాయాన్ని అందివ్వడంలో మందుబాబులకు తిరుగే లేదు. అలాంటి ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వానికి కూడా దొరకరు. అందుకే రేట్లు పెంచినా సరే.. తాగుడు మాత్రం తగ్గలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆమధ్య మద్యం ధరలు పెంచింది. గత నెల 19న ఈ కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో మొత్తం మద్యం అమ్మకాల్లో 40 నుంచి 50 శాతం అమ్ముడయ్యేది చీప్ లిక్కరే.

అయినా సరే దాని ధరను రూ.95 నుంచి రూ.125కు పెంచింది ప్రభుత్వం. దీంతో ఈ అమ్మకాలుపై కచ్చితంగా దాని ప్రభావం ఉంటుందనుకున్నారు. కానీ సీన్ రివర్సయ్యింది. రేట్లు పెంచకముందు నెలతో పోలిస్తే, రేట్లు పెంచిన నెల రోజుల అమ్మకాలు ఎంత పెరిగాయో తెలుసా? ఏకంగా రూ.530 కోట్లు పెరిగాయి. అంటే మందుబాబులు ఏ స్థాయిలో తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బీరుపై రూ.10, మామూలు క్వార్టర్ పై రూ.20, ప్రీమియం క్వార్టర్ పై రూ.40 లను పెంచింది ప్రభుత్వం. అయినా అమ్మకాలు తగ్గలేదు.

వ్యాపారులకు నెలవారీ టార్గెట్లు ఉంటాయి. కొనుగోళ్లు పెంచాలని చెబుతుంటారు. కానీ ఈసారి ఆ ప్రెజర్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు కూడా ఎక్కువగా అమ్మకాలు చేయడంపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే మద్యం ధరలు పెరగకముందు నెల రోజుల్లో అంటే.. ఏప్రిల్ 19 నుంచి మే 18 వరకు రూ.2,800 కోట్ల అమ్మకాలు జరిగాయి. ధరలు పెరిగిన తరువాత నెల రోజుల్లో అంటే మే 19 నుంచి జూన్ 18 వరకు రూ.3,300 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఒక్క నెలలోనే రూ.530 కోట్ల సేల్స్ పెరిగింది. అదే గతేడాది ఇదే నెలతో పోలిస్తే.. రూ.1,227 కోట్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మరి.. మందుబాబులా.. మజాకా!