Liquor Scam : ఇక‌ `వీసా`ఫోన్ క‌నిపిస్తే ఒట్టు! క‌విత గుట్టుర‌ట్టు!!

ఫోన్లు ఎంత డేంజ‌రో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నిరూపిస్తోంది. వాటి చుట్టూ న‌డుస్తోన్న‌ రాజ‌కీయాన్ని రెండు నెల‌లుగా చూస్తున్నాం

  • Written By:
  • Updated On - December 1, 2022 / 12:45 PM IST

ఫోన్లు ఎంత డేంజ‌రో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నిరూపిస్తోంది. వాటి చుట్టూ న‌డుస్తోన్న‌ రాజ‌కీయాన్ని రెండు నెల‌లుగా చూస్తున్నాం. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి త‌న మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న త‌రువాత టీడీపీ చేసిన ఆరోప‌ణ‌లు అన్నీఇన్నీ కావు. ఆ మొబైల్ ఫోన్ ఎక్క‌డ పోయిందో సోష‌ల్ మీడియా వేదిక‌గా `ఆన్ లైన్` పోటీని కూడా నిర్వ‌హించారు. ఆ ఫోన్ వెనుక ఢిల్లీ లిక్క‌ర్ క‌థంతా ఉంద‌ని టీడీపీ చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఆయ‌న అల్లుడి సోద‌రుడు శ‌ర‌త్ చంద్రారెడ్డి ఈ కేసులో అరెస్ట్ జ‌రిగిన త‌రువాత విజ‌య‌సాయిరెడ్డి ఫోన్ పోగొట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఆ ఫోన్ ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. కానీ, గుట్టంత దానిలోని ఉంద‌ని ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ధ్వంసం అయిన 153 ఫోన్ల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు ఉన్నారని అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వాళ్లంద‌రూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని గుర్తించింది. కానీ, వాటిలో కేవలం 17 ఫోన్లే దొరికాయని ఈడీ తెలిపింది. అమిత్​ అరోరా వాడిన 11 ఫోన్లు, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని నిర్థారించింది. ఈ కేసులో ధ్వంసమైన 153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచనా వేసింది. బ‌హుశా ధ్వంస‌మైన‌, మాయం అయిన ఫోన్ల జాబితాను ప‌రికిస్తే విజ‌య‌సాయిరెడ్డి ఫోన్ దొరుకుతుంద‌ని సోషల్ మీడియా వేదిక‌గా టీడీపీ సెటైర్లు వేస్తోంది.

ఢిల్లీ లిక్క‌ర్ కేసుకు సంబంధించి ప్ర‌ధానంగా విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని ఈడీ గుర్తించింది. సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్రా రెడ్డి ఉన్నారని ఈడీ తేల్చింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని, ఆ 10 ఫోన్ల కు సంబంధించిన ఈఎంఐఈ నెంబర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు. స‌రిగ్గా ఇక్క‌డే క‌విత ప‌క్కాగా ఈడీకి దొరికారు.

ఎవరీ అమిత్​ అరోరా ?
ఢిల్లీ గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు. మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా చ‌క్రం తిప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలు సేక‌రించిన ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అత్యంత స‌న్నిహితులుగా అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా ఉన్నార‌ని గుర్తించింది. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయ‌డంతో కీల‌క ఆధారాల‌ను ఈడీ రాబ‌ట్టింది.

సీబీఐ ఛార్జ్షీట్ లోని కీల‌కాంశాలివి
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్షీట్ ను రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖ‌లు ప‌రిచింది. ఎ1 గా కుల్దీప్ సింగ్, ఎ2 గా నరేంద్ర సింగ్, ఎ3గా విజయ్ నాయర్, ఎ4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు. ఈ కేసును తొలుత సీబీఐ విచారణ చేయ‌గా, ఆ త‌రువాత ఈడీ రంగంలోకి దిగింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

అరెస్టులు త‌థ్య‌మా?
కొన్ని కేసులలో రిమాండ్ రిపోర్టు ఆధారంగా అరెస్టులు జరుగుతాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో లావాదేవీలు కీలకంగా మారనున్నాయి. వందకోట్ల ముడుపుల పంచాయతీలో ఎవరికి ఎంత వాటా? ఎలా బ‌దిలీ అయ్యాయి? ఎవ‌రిఇ ద్వారా ఎవ‌రికి చేరాయి? ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కు డ‌బ్బు త‌ర‌లింది? అన్నదే ప్ర‌ధానం. మొత్తం 36మంది చుట్టూ తిరుగుతున్న ఈ లిక్కర్ స్కాంలో మరికొద్ది రోజుల్లో అరెస్టులు ఉండవచ్చు. అందులో కవిత ఉంటుందా? లేదా? అన్నది స‌మీప భవిష్యత్తు తేల్చ‌నుంది. కానీ, ఆమె తాజాగా చేస్తోన్న కామెంట్ల ఆధారంగా జైలుకు వెళ్ల‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు. మోడీ స‌ర్కార్ జైలుకు పంపిస్తే వెళ‌తానంటూ గ‌ద్గ‌త స్వ‌రంతో మీడియాకు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆమె వాయిస్ లోని భావాన్ని గ‌మ‌నిస్తే అరెస్ట్ ఖాయంగా క‌నిపిస్తోంది.

క‌విత విష‌యంలో జ‌రిగిందిలా..
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉంది. ఆమ్​ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని రిపోర్ట్ లో ఆరోపించారు. ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు. ఇదే విష‌యాన్ని నెల రోజుల క్రితం ఢిల్లీ బీజేపీ నేతలు చెప్పారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోల‌ను, ఆడియోల‌ను విడుద‌ల చేశారు. కీల‌క ఆధారాల‌ను ఈడీకి, సీబీఐకి అంద‌చేశారు. వాటి ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారుల‌కు నిందితులు వాడిన ఫోన్లు కీల‌క‌మైన `క్లూ`గా మారింది. ఫోన్లు ఆధారంగా ఢిల్లీ స్కామ్ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌కు లాగారు. అంటే, ఫోన్లు ఎంత డేంజ‌రో తెలిసింది క‌దా? అందుకే, విజ‌య‌సాయిరెడ్డి ఎక్క‌డో పోయింది. ఇప్ప‌ట్లో అది క‌నిపిస్తే ఒట్టు!