Site icon HashtagU Telugu

Rainfall:హైద‌రాబాద్‌కి వ‌ర్ష సూచ‌న.. వ‌చ్చే నాలుగురోజుల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు

rains

rains

హైద‌రాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే రాబోయే నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 19.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హయత్‌నగర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 17.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంద‌ని.. గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల గాలి వేగంతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వివరాల ప్రకారం కాప్రా, సికింద్రాబాద్, అల్వాల్, హయత్‌నగర్, బేగంపేటతో సహా హైదరాబాద్‌లోని తూర్పు ప్రాంతాలలో జనవరి 10న 15.6 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంద‌ని తెలిపింది. అయితే నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో 2.5 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 12.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పెద్దపల్లి, జగిత్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాల్లో జనవరి 10న 64.5 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని టీఎస్‌డీపీఎస్ అంచనా వేసింది.

హైద‌రాబాద్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు న‌మోద‌న ప్రాంతాలు ఇవే
హయత్‌నగర్ – 17.9 డిగ్రీల సెల్సియస్, సరూర్‌నగర్ – 18.6 డిగ్రీల సెల్సియస్, కాప్రా – 18.9 డిగ్రీల సెల్సియస్, ఉప్పల్ – 19 డిగ్రీల సెల్సియ‌స్‌, మల్కాజిగిరి – 19 డిగ్రీల సెల్సియస్ గా న‌మోదైయ్యాయి.

తెలంగాణ‌లోని వివిధ జిల్లాలో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆదిలాబాద్ – 12.7 డిగ్రీల సెల్సియస్, కోమ్రంభీం ఆసిఫాబాద్ – 13.2 డిగ్రీల సెల్సియస్, నిర్మల్ – 13.6 డిగ్రీల సెల్సియస్‌, మంచిర్యాల‌ – 14.5 డిగ్రీల సెల్సియస్‌, జ‌యశంకర్ భూపాలపల్లి – 14.6 డిగ్రీల సెల్సియస్ గా న‌మోదైయ్యాయి.

Exit mobile version