Maoists Letter : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ ఘాటైన వ్యాఖ్యలతో లేఖను విడుదల చేశారు. ‘‘కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరూ కార్పొరేట్ రాజకీయ నాయకులే’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు. ‘‘పొంగులేటి, పువ్వాడ ఇద్దరిలో ఎవరిని గెలిపించినా.. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తారు. అంతేతప్ప ప్రజల కోసం పనిచేయరు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొంగులేటి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. పొంగులేటి ఒక్కో నియోజకవర్గానికి రూ.40 కోట్లు, జిల్లా మొత్తం రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని అని అధిష్టానానికి ఆశ చూపుతున్నాడు’’ అని లేఖలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘పొంగులేటి, పువ్వాడ ఇద్దరూ అక్రమ మార్గంలో కోట్లు సంపాదించారు. ప్రస్తుతం వీరి దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలు కావాలంటే ఇద్దరికీ అధికారం అవసరం. అవినీతి డబ్బుతో అందలం ఎక్కేందుకు, అధికారం చేజిక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు’’ అని లేఖలో ఆజాద్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘పొంగులేటి తన అహంకారాన్ని వీడకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. మంత్రి పువ్వాడ అజయ్ సైతం జిల్లా అంతా తన చెప్పు చేతల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తన వ్యాపార సామ్రాజ్యం నుంచి కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఇచ్చి జిల్లాను గుప్పిట్లో పెట్టుకునేందుకు అజయ్ అహర్నిశలు కష్టపడుతున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేసేందుకు ఆయన డబ్బులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది’’ అని లేఖలో మావోయిస్టు నేత ఆజాద్ ఆరోపించారు. ఆజాద్ విడుదల చేసిన ఈ లేఖతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కలకలం రేగింది. ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను ఆజాద్ కోరారు. దొంగ ఓట్ల, దొంగ నోట్ల రాజ్యానికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ ఈ లేఖలో(Maoists Letter) పిలుపునిచ్చింది.