Kakatiya University: చట్టబద్ధంగానే విద్యార్థుల అరెస్టులు : కమిషనర్ రంగనాథ్

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - September 8, 2023 / 11:23 AM IST

Kakatiya University: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సోషల్‌ మీడియాలో పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ అడ్మిషన్ల భర్తీ విషయంలో ఈ నెల 4,5 తేదీల్లో పదిమంది విద్యార్థులు వీసీ, ప్రిన్సిపాల్‌ చాంబర్‌లోకి ప్రవేశించి దాడులు చేయడం, తలుపులు, కిటికీలు, కంప్యూటర్లు, ఇతర ఫర్నిచర్‌ ధ్వంసం చేసి ప్రొఫెసర్లను బెదిరించిన ఘటనలో కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటన తర్వాత విద్యార్థులను పోలీసులు కొట్టినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ ప్రచారంపై కేయూ వైస్‌ చాన్స్‌లర్‌ రమేశ్‌, ఎంజీఎం వైద్యులతో కలిసి సీపీ రంగనాథ్‌ గురువారం కలెక్టర్‌హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వీసీ చాంబర్‌లోకి ప్రవేశించి దాడులు చేసి, ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు చట్టపరంగానే వారిని అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు.

వీసీ కళ్లలో ఆనందం చూసేందుకే పోలీసులు కొట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను కూడా కొట్టానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్‌ చేసిన విద్యార్థులను కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఎంజీఎంకు తరలించి వైద్య పరీక్షలు చేయించినట్టు సీపీ తెలిపారు. న్యాయమూర్తి సూచనతో రెండోసారి కూడా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. కొందరు విద్యార్థుల సూచన మేరకు అరెస్ట్‌ అయిన విద్యార్థులు కట్లు కట్టుకుని వచ్చినట్టు వివరించారు. కేయూ క్యాంపస్‌లో విద్యార్థులను అరెస్ట్‌ చేసే క్రమంలో అక్కడి సీసీకెమెరాల్లో రికార్డ్ అయినా దృశ్యాలను జడ్జి పరిశీలించినట్టు పేర్కొన్నారు.

అరెస్ట్‌ అయిన విద్యార్థుల్లో ప్రశాంత్‌కు నెల క్రితం క్రికెట్‌లో గాయమైందని, దానిని చూపించి పోలీసులు కొట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అరెస్ట్‌ అయిన పదిమందిలో అంబాల కిరణ్‌, ప్రశాంత్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు పంపినట్టు పేర్కొన్నారు. వీరిపై గతంలోనూ క్రిమినల్‌ కేసులో నమోదైనట్టు తెలిపారు. అయ్యప్పస్వామిని తిట్టాడన్న కోపంతో కొన్ని నెలల క్రితం బైరి నరేశ్‌పై విద్యార్థి నాయకులు హనుమకొండలో దాడిచేశారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై బెయిలబుల్‌ కేసులు పెట్టినట్టు తెలిపారు.