తెలంగాణ (Telangana)లో రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో భూముల ధరలు (Land prices) అనూహ్యంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పరిధిలో చదరపు గజం భూములు లక్షల నుంచి కోట్ల వరకు పలుకుతుంది. అయితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఇంకా పాత రేట్లే కొనసాగుతుండటం వల్ల రిజిస్ట్రేషన్ సమయంలో భూముల అసలైన విలువ ప్రతిబింబించడంలేదు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గణనీయమైన లోటు కనిపిస్తోంది.
Kitchen: వంటగది అందంగా ఉండాలంటే ఈ మొక్కలు ఉండాల్సిందే!
ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువల పునఃసమీక్షకు సిద్ధమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువలను సవరించేందుకు చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీతో అధ్యయనం జరిపించి, మార్కెట్ విలువలు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మార్కెట్ డిమాండ్, సప్లై, గత ఐదేళ్ల ధరల పెరుగుదల, అభివృద్ధి అవకాశాలు వంటి అంశాలపై కమిటీ సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ నివేదికల ఆధారంగా వాస్తవానికి దగ్గరగా ఉండే కొత్త రేట్లను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా కొంత పెరగొచ్చని భావించినా, దీని వల్ల ప్రభుత్వ ఆదాయ వనరులు పెరుగుతాయి. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణలో ఇది సహకరిస్తుంది. ప్రజలకు భూముల అసలైన విలువ స్పష్టంగా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనిని శాస్త్రీయంగా, సమతుల్యంగా అమలు చేస్తే నష్టం ఎవరికీ కాకుండా, లబ్ధి అందరికీ చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.