Site icon HashtagU Telugu

KCR National Politics: సీఎం కేసీఆర్‌కు కుమారస్వామి సంపూర్ణ మద్ధతు

Kcr Kumaraswamy

Kcr Kumaraswamy

జాతీయ రాజకీయాల దిశగా సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. తాజాగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

మూడు గంటలపాటు సమాలోచనలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ పాత్ర, దేశ రాజకీయాల్లో కేసీఆర్ పోషించాల్సిన పాత్రపై సుధీర్ఘంగా చర్చించారు. జాతీయ రాజకీయాలపైనా సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాలతో పాటు కీలకమైన జాతీయ రాజకీయాలపై అర్థవంతమైన చర్చ జరిగిందని భేటీ అనంతరం కుమారస్వామి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికి కేసీఆర్‌ అనుభవం అవసరమన్నారు. కేసీఆర్‌ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తామని కుమారస్వామి తెలిపారు. అంతకుముందు కుమారస్వామి.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

తమ మధ్య అర్థవంతమైన చర్చ జరిగిందని కుమారస్వామి ట్వీట్‌ చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమస్యలు, జాతీయ రాజకీయాలపై తాము చర్చించామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆథిత్యం బాగుందన్నారు. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఇరువురి భేటి చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జాతీయ పార్టీ పేరు, జెండాపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు సీఎం కేసీఆర్. పార్టీ ఏర్పాటు తర్వాతే పొత్తులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. భారతీయ రాష్ట్ర సమితి పేరుపైనే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. దసరాలోపే జాతీయ పార్టీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో కేసీఆర్ సభలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. దేశాభివృద్ధి కోసం సమగ్ర ఎజెండా రూపకల్పనలో కేసీఆర్‌ నిమగ్నమయ్యారు. ఇక నుంచి వరుసగా వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని సంకేతాలు పంపేలా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు.

Exit mobile version