Site icon HashtagU Telugu

KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!

KT Rama Rao

Telangana Minister KTR America Tour

తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందడి ముగియడంతో.. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టింది. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోంది. కేంద్రం నుంచి రావల్సిన నిధులతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కోరింది.

అయినా సరే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిపై ఏ విషయం తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. అందుకే రాష్ట్రం తరపున కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొని రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోకే మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోం శాఖ పరిధిలోని భూముల అవసరం ఉన్నది. ఇందుకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇక ఎస్ఆర్డీపీలో భాగంగా తలపెట్టిన స్కై వేల నిర్మాణం కోసం కంటోన్మెంట్ పరిధిలోని భూములు కావాలి. గతంలోనే ఈ మేరకు రక్షణ శాఖకు లేఖ రాసినా స్పందన లేదు. దీంతో ఈ విషయంపై తేల్చాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మంత్రి కేటీఆర్ కలవనున్నారు.  వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్టు విషయంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా లేదా వీకే సింగ్‌తో సమావేశమై.. కోరనున్నారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం అవుతారు.