KTR UK Tour: యూకేలో కేటీఆర్ బిజీ బిజీ!

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకేలో పర్యటిస్తున్నారు.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 01:00 PM IST

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకేలో పర్యటిస్తున్నారు. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న కేటీఆర్.. తెలంగాణలోని వ్యాపార అవకాశాలను అక్కడి కంపెనీలకు వివరిస్తున్నారు. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్ బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన మంత్రి కేటీఆర్, పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, తెలంగాణలోని వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి తెలియజేశారు. టాప్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన తీసుకొచ్చిన విధానాలు, ఇప్పటివరకు తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను వారికి వివరించారు. తెలంగాణలో భూమి, నీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్ అని, ఎన్నోసార్లు అవార్డులు అందుకున్నారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు లైఫ్ సైన్సెస్, ఫార్మా బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హాట్‌ స్పాట్ గా మారిందని కేటీఆర్ అన్నారు. భారత్-బ్రిటీష్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలు తెలంగాణను తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26 వరకు జరగనున్న తన పర్యాటనలో మంత్రి కేటీఆర్ యూకేలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు.