Site icon HashtagU Telugu

Etela Security: కేటీఆర్ సంచలన నిర్ణయం, ఈటలకు సెక్యూరిటీ, డీజీపీకి కీలక ఆదేశాలు

Etela Security: బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ హత్య కు కుట్ర జరుగుతుందని ఈటల భార్య జమున ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఇదే అంశమై డీజీపీ అంజనీకుమార్ తో ఫోన్ లో కేటీఆర్ మాట్లాడారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు. ఈటలకు భద్రత పెంపుపై డీజీపీ సమీక్ష చేయనున్నారు. కాసేపట్లో ఈటల ఇంటికి సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్లనున్నారు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో ఈటల భార్య జమున ఈటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో ప్రాణ హాని ఉందని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గంటల వ్యవధిలోనే ఈటలకు ‘‘వై కేటగిరి’’ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డీజీపీని ఆదేశించడంతో హుజురాబాద్ ఎమ్మెల్యే భద్రతపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్రం కూడా ఆయనకు భద్రత కల్పించడం చర్చనీయాంశమవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్ అనివార్య కారణాల వల్ల పార్టీ నుంచి బయటకొచ్చి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.

Also Read: Wagner: పుతిన్ నాయకత్వ లోపమే తిరుగుబాటుకు కారణం: అమెరికా మాజీ రక్షణ మంత్రి