KTR: బీఆర్ఎస్ ఘోర ఓటమిపై కేటీఆర్ రియాక్షన్.. ఫీనిక్స్ లా పుంజుకుంటాం అంటూ!

  • Written By:
  • Publish Date - June 4, 2024 / 09:35 PM IST

KTR: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేది లేదని గుర్తు చేశారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ సాధించటంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ 2014 లో 63 సీట్లు, 2018 లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కొ నసాగుతుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ స్వల్ప తేడాతోనే ఓటమి పాలైందని గుర్తు చేశారు.

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమే. గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు. బీఆర్ఎస్ అదే సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఇప్పుడు వచ్చిన ఫలితాలు కచ్చితంగా మమ్మల్ని నిరాశ పరిచాయి. ఐతే ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోయేది లేదు. ఎప్పటి లాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటాం.

ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటామన్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని కేటీఆర్ తెలిపారు.