KTR: కాంగ్రెస్ పార్టీ-అదానీ వ్యవహారంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • Written By:
  • Updated On - January 18, 2024 / 02:50 PM IST

KTR: మహబూబ్ న‌గ‌ర్‌ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడార‌ని, 13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ డబ్బులు, అంతా ప్రధానమంత్రి కి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడార‌ని, కానీ అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ సాక్షిగా అదానితో అలైబలై చేసుకుంటున్నాడ‌ని కేటీఆర్ అన్నారు.

”కాంగ్రెస్ ఢిల్లీలో అదానితో కొట్లాడుతూ… ఇక్కడ మాత్రం ఎందుకు అదానితో కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలి. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ.. మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలి. బిజెపి ఆదేశాల మేరకే అదానితో ఇక్కడి ప్రభుత్వము, ఇక్కడి ముఖ్యమంత్రి కలిసి పని చేస్తున్నారు. అదానిపట్ల మారిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి కారణాలు ఏంటో చెప్పాలి” అని కేటీఆర్ అన్నారు.

”పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు… మొన్న ఉత్తంకుమార్, రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికి వీలులేదు అని చెప్పారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మావల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది… ఈ విషయాన్ని మహబూబ్నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి. మహబూబ్నగర్ కి పక్కనే ఉన్న అప్పర్ బద్ర ప్రాజెక్టుకి కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బిజెపిని నిలదీసే ప్రయత్నం ఉత్తంకుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు. ప్రియాంక గాంధీ 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ… కానీ అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెబుతున్నారు. అని కేటీఆర్ మండిప‌డ్డారు.

”ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామంటున్నారు. గతంలో రోజుకు పది లక్షల మంది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైన తర్వాత కూడా రైతుబంధు రైతు ఖాతాలలోకి వస్తలేదు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే… ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మళ్ళీ వచ్చినయ్… ఎరువులను పోలీస్స్టేషన్లో పెట్టి పంచే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది అని కేటీఆర్ హెచ్చ‌రించారు.