KTR: కరెంట్ కొరతతో శిశువులు, పేషెంట్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 07:11 PM IST

KTR: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ జరుగుతోందో మీరే గమనించండి అని, ఉత్తర తెలంగాణలో పేదలకు దిక్కు అయినటువంటి ఎంజీఎం లాంటి పెద్ద హాస్పిటల్ లో 5 గంటలు కరెంట్ లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఐదు గంటలు కరెంట్ పోతే నవజాత శిశువులు, ఐసీయూలో పేషెంట్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? ఎవరిది అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు వడ్లు అన్నింటికీ రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాడంట అని కేటీఆర్ ఆరోపించారు.

‘‘మన దగ్గర అసలు సన్న వడ్లే తక్కువ. యాసంగిలో సన్న వడ్లే పండవు. అది కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. లేదంటే కావాలనే మోసం చేసేందుకు సన్న వడ్లకే బోనస్ అని అంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి కాదు, రెండు కాదు…మోసాల పరంపర కొనసాగుతోంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతదని చెప్పాం. కరెంట్ కోతలు ఉన్నాయా? మార్పు బాగుందా? ఎంజీఎం హాస్పిటల్ 24 అంతస్తులతో కట్టాం. కానీ ఇప్పుడు ఆ హాస్పిటల్ పని ఎక్కడికక్కడే వదిలేశారు.’’ అని కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

‘‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎంజీఎం హాస్పిటల్ కడితే… దాన్ని ఆపిన దౌర్భగ్యాపు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అవసరమా? మేము ఎన్నో ఐటీ కంపెనీలను తెచ్చాం. కానీ ఇప్పుడు టెక్ మహీంద్రా వరంగల్ నుంచి వెళ్లిపోతోంది. టెక్ మహీంద్రా వెళ్లిపోయింది. ఎంజీఎం హాస్పిటల్ పనులు ఆపేశారు. కరెంట్ పోతోంది. మరి ఎందుకు వీళ్లకు ఓటు వేయాలి? రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాల్సింది పోయి…వచ్చిన కంపెనీలను కూడా కాపాడుకునే సోయి లేకుండా పోయింది’’ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.