Site icon HashtagU Telugu

KTR : సత్యమేవ జయతే ..ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్‌

KTR welcomes Supreme Court verdict on MLAs' disqualification

KTR welcomes Supreme Court verdict on MLAs' disqualification

KTR: “సత్యమేవ జయతే” అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అనధికారికంగా ఇతర పార్టీలో చేరిన అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేటీఆర్‌ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పులో, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై స్పందించిన కేటీఆర్‌ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తీర్పు ఇది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి తోడ్పాటుగా నిలిచింది. దీనికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ప్రధాన న్యాయమూర్తి (CJI)కి ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

Read Also: Investment : వామ్మో ఏపీలో గూగుల్ 50 వేల కోట్ల పెట్టుబడి..యూఎస్ తర్వాత వైజాగే !!

అలాగే, ఈ అంశంపై రాహుల్‌ గాంధీ పాంచ్‌ న్యాయ సూత్రాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులు న్యాయ నైతికతకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చట్టవిరుద్ధంగా పార్టీ మారిన వారిని గుర్తించేందుకు ఎలాంటి దర్యాప్తు అవసరం లేదు. ఇది స్పష్టమైన విషయమే. ప్రజల విశ్వాసాన్ని ద్రోహించిన ఎమ్మెల్యేలు ఇక ప్రజల ముందుకు వెళ్లాల్సిందే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నట్లు సూచించారు. “ఇకముందు మూడు నెలల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పూర్తిగా సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ తగిన విధంగా ముందడుగు వేస్తుంది అని తెలిపారు. అంతేకాదు, ఈ కేసులో కీలక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్ లీగల్ టీమ్‌ను కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కష్టసమయంలో న్యాయపరంగా మాతో ఉన్న మా లీగల్ టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహకారమే ఈ విజయం వెనుక ఉంది అని కొనియాడారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం వెళ్లినట్లయింది. రాజకీయ విలువలు, ప్రజల నమ్మకాన్ని కాపాడే దిశగా ఇది కీలకమైన మలుపు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మార్చిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్పీకర్ అనర్హత పిటిషన్లపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Read Also: India U19 Squad: కంగారూల దేశానికి కుర్ర దళం.. భారత U19 జట్టు రెడీ