కేసీఆర్ (KCR) కుటుంబంలో విభేదాలు బయటపడుతున్నాయా..? మొన్నటి వరకు ప్రచారానికే పరిమితమైన విభేదాలు ఇప్పుడు రోడెక్కుతున్నాయా..? కేటీఆర్ – కవిత (KTR vs Kavitha) మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..? అంటే అవుననే అర్ధం అవుతుంది. ఇటీవల కేసీఆర్ కు కవిత లేఖ (Kavitha Letter) రాయడం..పలు విషయాలు ప్రస్తావించడం..అంతే కాకుండా కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం వంటి కామెంట్స్ ఇప్పుడు రచ్చ లేపుతున్నాయి. అయితే కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ నేరుగా స్పందించనప్పటికీ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు.
శనివారం కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసిన అనంతరం కవిత వ్యవహారంపై స్పందించారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం మంచిది కాదని, ఆ విషయాలు పార్టీలోపలే చర్చించాలన్న సూచన చేస్తూ కవితకు సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ప్రజాస్వామ్య విలువలు ఉన్నప్పటికీ, అంతర్గత వ్యవహారాలు బయటకు రావడం అప్రయోజనకరమని పేర్కొన్నారు.
TS POLYCET : తెలంగాణ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల
కవిత ఇటీవల ఎయిర్ పోర్టులో ఇచ్చిన వ్యాఖ్యలు ,కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, కోవర్టులు ఉన్నారన్న ఆరోపణలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత లేఖ చిన్న విషయమని చెప్పినా, ఆమె స్పందనపై కేటీఆర్ పూర్తిగా సానుభూతితో లేరన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తన ప్రసంగంలో ‘సమయం వచ్చినప్పుడు కోవర్టుల గురించి బయటపడతాయి’ అన్న వ్యాఖ్యతో కేటీఆర్ ఆవేదనను పరోక్షంగా వెలిబుచ్చారు.
ఇక కవిత వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ ఏమనుకుంటున్నారన్న విషయం మాత్రం ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. బీఆర్ఎస్ క్యాడర్ లోనూ ఈ అంశంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. కవిత ప్రస్తుతం సొంత రాజకీయ ప్రాధాన్యతకే ఎక్కువగా దృష్టి ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో తన భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఆమెపై పార్టీ శ్రేణుల్లో మిశ్రమ అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.