హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. “పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లే కేటీఆర్ కూడా అభివృద్ధి విషయంలో అలా ప్రవర్తిస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో ఫాం హౌస్ పాలన తప్ప ప్రజల కోసం ఏ పని జరగలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయాలే అమలయ్యాయని, ఇదే విషయాన్ని కేటీఆర్ గతంలో ఒప్పుకున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై విమర్శలే కేటీఆర్‌కు ముఖ్య పనిగా మారాయని అన్నారు.
రేవంత్ కుటుంబంలో ఎవరెవరున్నారు, ఎవరికీ పోస్టులు ఇచ్చారు అనేది కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. “కేటీఆర్ లాగా ఇంట్లో ఉన్న వారందరికీ పదవులు ఇవ్వడం మా ప్రభుత్వ ధోరణి కాదు” అని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కేటీఆర్ చేసిన పనులు, తీసుకువచ్చిన పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. “కేటీఆర్ అండ్ కో తెలంగాణ అభివృద్ధికి అడ్డంకి. మేము మంచి చేస్తుంటే వారు అడ్డుకుంటున్నారు” అని ఆరోపించారు.
వ్యాపారవేత్తలను కేటీఆర్ బెదిరించారంటూ విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా కేటీఆర్ వైఖరి మారలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో కూడా ఓటమి తర్వాత బిహేవియర్ మారలేదని విమర్శించారు.
ఇదే అంశంపై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా స్పందించారు. ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవగానే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. “ఇంకా రెండు ఉప ఎన్నికలు వస్తే కేటీఆర్ అమెరికా పారిపోతారు” అని సెటైర్ వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ పదేళ్ల పాలనలో దోచుకున్న ధనంతో విర్రవీగుతున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో రూ.55 కోట్లు విలువ చేసే 20 ఎకరాల భూమిని బీఆర్ఎస్ అధ్యక్షుడికి కేటీఆర్ కట్టబెట్టారని మండిపడ్డారు. ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ మీడియా ముందు ఒకలా, కోర్టులో మరోలా చెప్తున్నారని విమర్శించారు.
కవితపై వచ్చిన ఆరోపణల విషయంలో కేటీఆర్, హరీశ్ రావు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పైకి గాంభీర్యం చూపిస్తూ… లోపల మాత్రం అరెస్టు కాకుండా కోర్టు మెట్లు ఎక్కుతున్నారని బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు.
