Site icon HashtagU Telugu

KTR Vs CMO : కేటీఆర్ వర్సెస్ సీఎంఓ.. సియోల్ పర్యటనపై ట్వీట్ల యుద్ధం

Ktr Vs Cmo Tweet War Seoul Visit Telangana Govt Delegation

KTR vs CMO :తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం సియోల్ (దక్షిణ కొరియా) నగర పర్యటనపై రాజకీయ వాగ్యుద్ధం నడుస్తోంది. దీనిపై ట్విట్టర్ వేదికగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును యావత్ దేశం గర్వించే రీతిలో నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సియోల్ నగరంలో పర్యటించి, అక్కడి ‘చియోంగ్‌ చియాన్‌’ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు 25 మందితో కూడిన ప్రతినిధి  బృందాన్ని తెలంగాణ సర్కారు పంపింది. ఇందుకోసం శనివారమే వారంతా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ప్రతినిధి  బృందం రేపటి (ఈనెల 21) నుంచి ఈనెల 24 వరకు సియోల్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనకు వెళ్లిన వారిలో రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు, జర్నలిస్టులు ఉన్నారు. ఈ పర్యటనకు ఎంపిక చేసిన వారి వివరాలను ఇప్పటికే రాష్ట్ర సర్కారు  వెల్లడించింది. సియోల్‌ సందర్శన కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనను బాయ్‌కాట్ చేశారు.

Also Read :Yazidi Babies Meat: యజీదీ పిల్లల మాంసం వండిపెట్టారు.. యువతి సంచలన ఇంటర్వ్యూ

కేటీఆర్ ట్వీట్ ఇదీ.. 

తెలంగాణ ప్రభుత్వం తరఫున నిపుణుల టీమ్‌ను సియోల్‌ సందర్శనకు పంపుతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్(KTR vs CMO) ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ‘‘నిపుణుల టీమ్‌లో పర్యావరణ వేత్తలు, హైడ్రాలజిస్టులు, ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లు ఉన్నారు. వారంతా వెళ్లి సియోల్‌లో ఉన్న రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేయనుండటం సంతోషకరమైన విషయమే. అయితే తప్పకుండా వాళ్లంతా తెలంగాణకు తిరిగొచ్చిన తర్వాత  చాలా మంచి రిజల్ట్స్ చెబుతారు. రూ.1.50 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టడాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతారు’’ అని కేటీఆర్ విమర్శించారు.

బోరెడ్డి అయోధ్యరెడ్డి కౌంటర్

కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాసంబంధాల ముఖ్య అధికారిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ జర్నలిస్టు, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘కేటీఆర్ చేసిన ట్వీట్ సీనియర్ జర్నలిస్టులను అవమానించేలా ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడు కూడా జర్నలిస్టులకు నిపుణులుగా గుర్తింపు దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టులను కూడా నిపుణులుగా పరిగణించి సియోల్‌లోని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అధ్యయనానికి పంపుతోంది. బీఆర్ఎస్ హయాంలో కనీసం ప్రగతి భవన్‌లోకి జర్నలిస్టులకు అనుమతులు ఈజీగా దొరికేవి కావు’’ అని  బోరెడ్డి అయోధ్యరెడ్డి పేర్కొన్నారు. ‘‘జర్నలిజం బేసిక్స్‌పై కేటీఆర్‌కు అవగాహన లేదు. జర్నలిస్టును మాస్టర్ ఆఫ్ ఆల్ అంటారనే విషయం కేటీఆర్‌కు తెలియనట్టుంది. జర్నలిస్టులను ఉద్దేశించి కేటీఆర్ చులకనగా కామెంట్స్ చేయడం సరికాదు. ఇలా మాట్లాడినందుకు వెంటనే మీడియాకు క్షమాపణలు చెప్పాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

Also Read :Elon Musk: రోజూ ఒక ఓటరుకు రూ.8 కోట్లు.. ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్