KTR Vs CM Revanth : తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. తాము అధికారంలోకి రాగానే సచివాలయం వద్ద నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. ‘‘చేతనైతే ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి వేయండి’’ అంటూ కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి. ఈసందర్భంగా సోమాజిగూడలో రాజీవ్ గాందీ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. ‘‘సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థలంలో కేటీఆర్ వాళ్ళ అయ్య విగ్రహం పెట్టాలని అనుకున్నాడు. కేసీఆర్ సచ్చేది ఎప్పుడు.. ఆ విగ్రహం అయ్యేది ఎప్పుడు’’ అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. ‘‘కేసీఆర్ విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా?’’ అని కేటీఆర్‌ను తెలంగాణ సీఎం ప్రశ్నించారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని పేర్కొన్నారు. సచివాలయం ఎదుట దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదనని రేవంత్(KTR Vs CM Revanth) వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join
అధికారం మీకు ఇక కలనే..
‘‘బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే. ఇక మీరు చింతమడకకే పరిమితం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘పదేళ్లు అధికార పీఠంపై ఉన్నప్పుడు సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన కేటీఆర్‌కు రాలేదా ? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదేనని సీఎం ప్రకటించారు. ఈవిషయంలో తమ చిత్తశుద్ధిని ఏ సన్నాసీ శంకించాల్సిన అవసరం లేదన్నారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని బీఆర్ఎస్ నేతలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సెక్రటేరియట్ లోపల పరిసరాలను పరిశీలించి, డిసెంబరులో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఆర్అండ్‌బీ అధికారులతో చర్చించారు.
Also Read :Land Prices Hike : త్వరలోనే భూముల ధరలు పెంపు.. థర్డ్ పార్టీ నివేదిక అందగానే నిర్ణయం
మళ్లీ స్పందించిన కేటీఆర్..
ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ట్విటర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు. తెలంగాణ సచివాలయం పరిసరాల్లోని చెత్త చెదారాన్ని తాము మళ్లీ కార్యాలయంలోకి ప్రవేశించిన వెంటనే తొలగిస్తామని ఆయన ప్రకటించారు. ‘‘మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోగలరని మేం ఆశించలేం. బడి పిల్లల ముందు నీచమైన పదాలు వాడటం మీ ఆలోచనేంటో చూపించింది’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘మీరు ఈ మానసిక వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.