సిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి, సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ, ఒలింపిక్ చర్చలపై దృష్టి పెట్టడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “రాష్ట్రం వరదలతో మునిగిపోతున్న వేళ, ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటల నష్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం ముఖ్యమా? లేక ఒలింపిక్ ప్రణాళికలపై సమీక్ష ముఖ్యమా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
AP : ప్రతి కుటుంబానికి ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ : సీఎం చంద్రబాబు
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించి ప్రాణాలను కాపాడినట్లు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణకు చెందిన హెలికాప్టర్లు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేక బీహార్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయనే ఆరోపణలు చేశారు. ఖమ్మంలో వరదలు వచ్చినా పట్టించుకునే వారెవరూ లేరని, ముగ్గురు మంత్రులు ఉన్నా హెలికాప్టర్ పంపలేదని విమర్శించారు. నర్మల్‌లో చిక్కుకున్న ఐదుగురిని చివరకు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి రక్షించిందని, ఒకరు వరదలో కొట్టుకుపోయారని ఆయన తెలిపారు.
ప్రజల నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ముందడుగు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పంటనష్టం చోటుచేసుకున్న ప్రతి ఎకరానికి రూ.25 వేల పరిహారం, ప్రాణనష్టం కలిగిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, కూలిపోయిన ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా వరద బాధితులకు ఆహారం, వైద్యసేవలు అందించేందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా సహాయకచర్యలు చేపడుతున్నందుకు అభినందనలు తెలిపారు.