Site icon HashtagU Telugu

KTR: జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన కేటీఆర్, రేవంత్ సర్కారు పై ఆరోపణలు

Ktr Revanth

Ktr Revanth

KTR: గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎట్లాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పైన ఇతర పార్టీల నేతలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పైన, రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని అంతమొందించాలన్న ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైందన్నారు.

భవిష్యత్తులో శంకర్ పైన దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. శంకర్ పైన పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గుండాలు ఆయనను అంతమొందించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికులు, సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదన్నారు. శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన పైన దాడికి తెగబడిందని ఆరోపించారు. శంకర్ ను అంతమొందించేందుకు భౌతికంగా దాడి చేసినా, స్థానిక పోలీసులు హాత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం పక్షపాతం చూపించారన్నారు.

పోలీసుల పక్షపాత వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాష్ట్ర డిజిపిని కేటీఆర్ కోరారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంపైన అడ్డగోలుగా మాట్లాడినా, ప్రభుత్వంపైన అనేక అసత్య ప్రచారాలు చేసినా, పది సంవత్సరాలపాటు ప్రభుత్వంలో ఉన్న ఏనాడు కూడా భౌతిక దాడులకు పాల్పడలేదని కేటీఆర్ గుర్తు చేశారు.