KTR Tweet : బీజేపీ స‌త్య‌హ‌రిశ్చంద్రుల‌కు `జ‌స్ట్ ఆస్క్` జ‌ల‌క్‌

ఏ రోజైనా తెలంగాణ సీఎం కేసీఆర్ తో స‌హా క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ జైలు ఊచ‌లు లెక్క పెట్టాల్సిందే అంటూ బీజేపీ నేత‌లు బీరాలు ప‌లుకుతున్నారు. అధికారంలోకి వ‌స్తే కేసీఆర్ ,కేటీఆర్ ల‌ను బొక్క‌లోకి తోస్తా, అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 04:00 PM IST

ఏ రోజైనా తెలంగాణ సీఎం కేసీఆర్ తో స‌హా క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ జైలు ఊచ‌లు లెక్క పెట్టాల్సిందే అంటూ బీజేపీ నేత‌లు బీరాలు ప‌లుకుతున్నారు. అధికారంలోకి వ‌స్తే కేసీఆర్ ,కేటీఆర్ ల‌ను బొక్క‌లోకి తోస్తా, అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఏడాది క్రితం దుబ్బాక ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. అదే డైలాగును హుజూరాబాద్ ఎన్నిక‌ల్లోనూ వినిపించారు. సీన్ క‌ట్ చేస్తే, ఆ రెండు ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచిందిగానీ, ఎంచ‌క్కా కేసీఆర్ మాత్రం పరిపాల‌న సాగిస్తున్నారు. అంతేకాదు, ట‌చ్ చేసి చూడండంటూ బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు కేసీఆర్ ఛాలెంజ్ విసిరారు.

ఇదో ఈడీ అదిగో సీబీఐ అంటూ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో పాటు ఆయ‌న ఫ్యామిలీని భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం బీజేపీ లీడ‌ర్లు చేస్తున్నారు. ఇదంతా అదిగో పులి సామెత‌గా ఉంద‌ని సామాన్యులు సైతం అనుకుంటున్నారు. ద‌మ్ముంటే, కేసీఆర్ ను అరెస్ట్ చేయాల‌ని టీఆర్ఎస్ నేత‌లు మీడియాముఖంగా ప‌లుమార్లు స‌వాల్ చేశారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ అగ్ర‌నేత‌లు కేసీఆర్ ను ట‌చ్ చేయ‌డానికి సంకోచిస్తున్నారు. ఇదంతా ఆ రెండు పార్టీల‌ రాజ‌కీయ మైండ్ గేమ్ గా కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీని పెట్ట‌డానికి కేసీఆర్ సిద్ధం అయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని డైరెక్ట్ గా ఢీ కొట్ట‌డానికి ఆయ‌న రెడీగా ఉన్నారు. దీంతో మ‌ళ్లీ ఈడీ, సీబీఐ అంటూ బీజేపీ నేత‌లు స‌న్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఆ క్ర‌మంలో `జ‌స్ట్ ఆస్క్‌` ట్యాగ్ తో బీజేపీ నేత‌ల‌ను ఆడుకుంటూ మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సామాన్యుల‌ను సైతం ఆక‌ట్టుకుంటోంది.

 

విప‌క్షాల‌కు చెందిన నేత‌ల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఐటీ, ఈడీల‌తో దాడులు చేయిస్తోంద‌ని చాలా కాలం నుంచి వినిపిస్తున్న మాట‌. తాజాగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీల‌కు కూడా ఈడీ మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 23వ తేదీన. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు పంపింది. ఈ నేప‌థ్యంలో గ‌డ‌చిన 8 ఏళ్ల బీజేపీ పాల‌న‌లో ఎంత‌మంది బీజేపీ నేత‌ల‌పై సీబీ, ఐటీ, ఈడీ దాడులు జ‌రిగాయని ప్ర‌శ్నిస్తూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ పోస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బీజేపీ నేత‌లే కాకుండా క‌నీసం వారి అనుచ‌ర వ‌ర్గంపై అయినా ఈ 8 ఏళ్ల కాలంలో ఎన్ని దాడులు జ‌రిగాయని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అంటే, బీజేపీకి చెందిన నేత‌లంతా స‌త్య హ‌రిచంద్రులేనా? అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ ట్వీట్ కు `జ‌స్ట్ ఆస్కింగ్` అంటూ ఓ కామెంట్‌ను కూడా త‌గిలించ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ కేటీఆర్ కు ఇప్పుడు ట్వీట్ చేయాల‌ని అనిపించ‌డం వెనుక సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంఘ‌ట‌న ఉంది. గ‌తంలోనూ రాహుల్ పుట్టుక‌పై బీజేపీ నేత‌లు చేసిన కామెంట్ల చేసిన స‌మ‌యంలో కేసీఆర్ అభ్యంత‌ర పెట్టారు. ప‌రోక్షంగా రాహుల్ కు మ‌ద్ధ‌తు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ క‌లిసి వెళుతుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దానికి వ‌రంగ‌ల్ వేదిక నుంచి రాహుల్ క్లారిటీ ఇవ్వ‌డంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు తూచ్ అని తేలింది. ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐడీ దాడులు గురించి కేటీఆర్ ప్ర‌స్తావించారు. అంటే, త్వ‌ర‌లో బీజేపీ నేత‌లు చెప్పిన‌ట్టుగా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపే దిశ‌గా ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జ‌ర‌గ‌బోతున్నాయా? అనే అనుమానం క‌లుగుతుంది. అంత ద‌మ్ము బీజేపీకి ఉందా? అనేది చూద్దాం!