తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా మరింత వేడెక్కింది. ఈ అంశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఫోన్, తన భార్య ఫోన్ ట్యాప్ చేసిందని, కుటుంబ వ్యక్తిగత సంభాషణలను కూడా విన్నారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలను ప్రచారం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు.
బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన ఆరోపణల ప్రకారం.. బీఆర్‌ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ (KCR & KTR) ఆదేశాలతో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, తమ కుటుంబ సభ్యులైన హరీష్ రావు, కవితల ఫోన్‌లు కూడా ట్యాప్ అయ్యాయని ఆయన ఆరోపించారు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలంటే ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
Coolie : అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతున్న ‘కూలీ’
బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్, ఆయనకు 48 గంటల గడువు ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ గడువులోగా బండి సంజయ్ తన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంతో కేటీఆర్ న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ రాజకీయ వివాదం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.