Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు సుఖేష్ చంద్రశేఖర్. అంతేకాకుండా ఫోర్జరీ, దోపిడీ మరియు మనీలాండరింగ్ వంటి ముప్పైకి పైగా హై ప్రొఫైల్ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఫోర్టిస్ మాజీ వ్యవస్థాపకుడి భార్య నుండి రూ. 200 కోట్లకు పైగా దోపిడీ చేసిన ఆరోపణలతో పాటు ఇతర అవినీతి ఆరోపణలపై ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. అయితే సుఖేష్ ఆ మధ్య సీఎం కుమార్తె కల్వకుంట్ల కవితపై అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాములో తనతో జరిపిన వాట్సాప్ చాట్ బయటపట్టి మీడియా దృష్టిని ఆకర్షించాడు. కవితతో తాను పలుమార్లు చాటింగ్ చేసినట్టు, లావాదేవీలపై కోడింగ్ ఉపయోగించి చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ బయటకు తీశాడు. అయితే తాజాగా ఆయన మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేశాడు.
కేటీఆర్, కవితల మధ్య జరిగిన 2000 కోట్ల రూపాయల లావాదేవీల డేటాతో పాటు తమ ముగ్గురి మధ్య 250 జీబీ సైజులో కాల్ రికార్డింగ్‌లు, చాట్‌లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్, కవిత సన్నిహితులు తనకు రూ.100 కోట్లు, శంషాబాద్‌లో భూమి, రాబోయే అసెంబ్లీ టిక్కెట్టు ఆఫర్ చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీబీఐ డైరెక్టర్ కు సుఖేష్ లేఖ రాశాడు.ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి వారికి మరియు ఆప్ నాయకులకు వ్యతిరేకంగా అతను ఈడీకి అందించిన వాంగ్మూలాలు మరియు సాక్ష్యాలను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నట్టు సుఖేష్ లేఖలో పొందుపరిచాడు. అయితే తాజాగా సుఖేష్ ఆరోపణలపై కేటీఆర్ స్పందించాడు. నేరస్తుడి మాటలను పట్టించుకోవద్దని, తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశాడు. అనుకున్నట్టే ఈ రోజు కేటీఆర్ సుఖేష్ చంద్రశేఖర్ కు లీగల్ నోటీసులు పంపారు.
Read More: Gun Fire: సిటీ శివారులో కాల్పుల కలకలం, వివాహేతర సంబంధమే కారణం