KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు

  • Written By:
  • Publish Date - May 18, 2024 / 09:51 PM IST

KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.  ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారు.. మేనేజ్‌మెంట్ మరియు ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని అన్నారు. అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు.

‘‘అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారు.  సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్‌ను రూపొందించి ఉచితంగా అందజేశారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారు.  కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు.  ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు.