KTR – CM Candidate : సీఎం సీటుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం కావాలనే పిచ్చి ఆలోచనలు, ఎజెండాలు నాకేవీ లేవు. నా కంటే సమర్థులు, తెలివైన వారు పార్టీలో చాలామంది ఉన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘మా నాయకుడు కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో ఎవరికీ రెండో ఆలోచన లేదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘‘కేసీఆర్ ప్రజల ఆస్తి. ఆయన ఎక్కడ పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారు. అక్కడక్కడా ఎమ్మెల్యేలపై కొంత అసంతృప్తి ఉన్నా, కేసీఆర్ పై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది’’ అని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ- ఫారాల పంపిణీ పూర్తయిందని, గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లే ఈసారి బీఆర్ఎస్ కు వస్తాయని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. ఈటల రాజేందర్ బీజేపీ తరఫున 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాల్సి వస్తుందేమో’’ అని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లోనూ ఈటల ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. ‘‘దేశంలో కాంగ్రెస్ గెలిస్తే కుంభకోణాల మేళా జరుగుతుంది. రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆయన దోశలు, ఇడ్లీలు వేయడం బాగా నేర్చుకోవాలి’’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘‘ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కాంగ్రెస్ వైఖరిని అర్థం చేసుకోవాలి. మక్తల్, మణికొండ మున్సిపాలిటీల్లో బీజేపీ, కాంగ్రెస్ పదవులు పంచుకున్నాయని తెలుసుకోవాలి. కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో ఒకరికొకరు ఓట్ల మార్పిడి చేసుకున్నాయి’’ అని ఆయన(KTR – CM Candidate) తెలిపారు.