తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Govt)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకే ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బును ఎటు ఉపయోగించిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు వాగ్దానాలు చేసిన ‘ఆరు గ్యారంటీలలో’ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆర్థిక పరిపాలనలో విఫలమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. “రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2,500, తులం బంగారం, పింఛన్ల పెంపు వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అలాంటప్పుడు ఆ అప్పు ఎందుకు చేశారు? ఆ డబ్బంతా ఎటు పోయిందో చెప్పగలరా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలతో కాంగ్రెస్ నేతలను నిలదీశారు.
“బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. గత పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసినా ప్రతి రూపాయిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడమే తప్ప, అభివృద్ధికి దారితప్పింది” అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో రాష్ట్రం ముందంజలో ఉందని ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తన పరిపాలనలో కనీస అవగాహన లేకుండా ముందుకెళ్తోంది” అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాటిని నమ్మబోరని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : 4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్