Musi Presentation : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్‌లో మూసీ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నిన్న అన్ని అబద్దాలు చెప్పారన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని సెటైర్లు వేశారు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మూసి నది నగరంలో 57 కిలోమీటర్లు ప్రవహిస్తుందని.. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తాయన్నారు. నగరంలోని ప్రతీ వాన చినుకు మూసీలోనే కలుస్తుంది. మేము మూసీని కరకట్టలతో కాపాడాలనుకున్నామని తెలిపారు. మూసీలోకి గోదావరి జలాలలను తెప్పించాలనుకున్నాం. కానీ రేవంత్ సర్కార్ మూసీని పురిట్లోనే చంపే ప్రయత్నం చేస్తోందన్నారు. మూసీని మురికి కుంపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీలే అన్నారు. రేవంత్ రెడ్డి నల్గొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు. మా ఇంటికి ఎవరు రాలేదు.. సర్వే జరగలేదని ప్రజలే చెబుతున్నారు. ఈయనేమో రెండు నెలల నుంచి సర్వే చేస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారు. ఇక జేసీబీలతో, కూలీలను పెట్టి ఇండ్లు కూలగొడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా సోషల్ మీడియాలో కూడా వీడియోలు వచ్చాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూలగొట్టేందుకు వచ్చిన ఓ కూలీ కూడా బాధపడ్డట్టు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. రెండు గంటల పాటు ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదటుపెడితే లక్షన్నర అంచనా వ్యయం దాకా అన్ని అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
ఆయన పాపం బయటపడుతుందని చెప్పి.. ఇది మూసీ బ్యూటీఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెటమలు పడుతున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్న క్రమంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లక్షన్నర కోట్ల కుంభణానికి కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.. దాన్ని సమాజం గమనిస్తుంది. మీరు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు. 420 హామీలతో ప్రజల గొంతు కోశారు. ముఖ్యమంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూటల కోసమే అని తేలిపోయింది. ఈ ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందంటే.. నోట్ల రద్దు చేసినప్పుడు మోడీ చెప్పిన మాటల మాదిరిగా చోటే భాయ్ రేవంత్ మూసీపై రోజుకో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.