KTR to Amit Shah: మా ప్రశ్నలకు బదులిచ్చాకే..తెలంగాణపై గడ్డపై అడుగుపెట్టండి..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం చూపుతున్న పక్షపాతాన్ని ఎండగట్టారు.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 09:54 AM IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం చూపుతున్న పక్షపాతాన్ని ఎండగట్టారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీది అదే వివక్ష అని ఆరోపించారు. కేంద్రానికి బాసటగా నిలుస్తున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదన్నారు. ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు ఇవ్వడం…విషం చిమ్మి పోవడం కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ….గుజరాత్ కు మాత్రం ఇవ్వని హామీలను ఆగమేహాల మీద అమలు చేయడం దేనికంటూ ప్రశ్నించారు కేటీఆర్.

ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందన్నారు కేటీఆర్. తెలంగాన సమాజం చైతన్యవంతమైందన్నారు. తెలంగాణ నేలపై అమిత్ షా అడుగుపెడుతున్న నేపథ్యంలో విభజనచట్టంలోని హామీలను తెలంగాణ సాక్షిగా కేంద్రం ముందుకు తేవడంతోపాటుగా వాటికోసం కొట్లాడటం కూడా మా బాధ్యతేనని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక అంశాలపై తమ దృష్టికి తెస్తున్నానన్నారు.

కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు?

ఎంతకాలం తెలంగాణపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతారు..రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని…రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చిందా అని ప్రశ్నించారు. రైల్వే ఫ్యాక్టరీ గుజరాత్ లో ఎలా వస్తుంది…కాజీపేటకు ఎందుకు రాదని ప్రశ్నించారు కేటీఆర్. ఐఐఎం, నవోదయ, ఐసర్ విద్యాలయాలు తెలంగాణకు ఎందుకు కేటాయింలేదని నిలదీశారు. గుజరాత్ లో ఓ మెడికల్ విద్యార్థికి అడ్మిషన్ లోఅన్యాయం జరిగిందని ప్రధాని అన్న వార్తలు చూశాం…అర్హతగల విద్యార్థికి అన్యాయం జరిగితే ప్రధాని స్పందించారు. ఇంతవరకు బాగుంది. కానీ మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు.దీని ఫలితంగా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు మెడిసిన్ చదవుకోలేకపోతున్నారు. మరి మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే…ప్రధాని మీకు ఎందుకు బాధ కలగడం లేదని మండిపడ్డారు.

ఐటీఐఆర్ రద్దును ఏమనాలి..?

బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీ తుంగలో తొక్కారు. హైదరాబాద్ లో ఐటీ డెవలప్ మెంట్ ను అడ్డుకునేందుకు ITIRరద్దు కూడా కుట్రాకాదా అని ప్రశ్నించారు. ఐటీ రంగంలోఅగ్రస్థానంలోఉన్న తెలంగాణ…అలాంటిది సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా ఏమైంది…హైదరాబాద్ ఫార్మా సిటికి ఎందుకు సాయం చేయడం లేదు..ఢిఫెన్స్ కారిడార్ సంగతి ఏమైందంటూ ప్రశ్నించారు.

ఏం ముఖం పెట్టుకొని హైదరాబాద్‌ వస్తున్నారో చెప్పాలి..

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నదీ ప్రక్షాళనకు వేలకోట్లు కేటాయిస్తారు. మా మూసీ ప్రక్షాళనకు మూడు పైసలు కేటాయించరు. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ ఎరగని వరదలు వస్తే….గుజరాత్ కు వేల కోట్ల వరదసాయం అందించారు. హైదరాబాద్ కు మొండిచేయి చూపించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్ వస్తున్నారని ప్రశ్నించారు. ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా…దేశంలోని అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ ఉన్న తెలంగాణకు చేయూత ఇవ్వకుండా…మెగాపవర్ లూం క్లస్టర్ ఇవ్వకుండా శీతకన్ను వేసింది నిజం కాదా అని నిలదీశారు. ఇక నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశప్రజల నడ్డివిరిచేలా పెంచుతున్న పెట్రోధరలపై సెస్సులను రద్దు చేసిన ప్రజలకు భారం తగ్గించాలని మా సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్ విషయంలో మీ వైఖరి స్పష్టం చేస్తారా అని ప్రశ్నించారు. దేశ ప్రజానీకం మోపిన సెస్సుల భారాన్ని రద్దు చేసి పెట్రో ధరలను తగ్గిస్తారా లేదో తెలంగాణ గడ్డమీద స్పష్టం చేయాలని నిలదీశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టబోతున్నామని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారని…కానీ దాన్ని కూడా గుజరాత్ కు తీసుకెళ్లిన మీ వైఖరి….గుజరాత్ పక్షపాత వైఖరి కాదా అంటూ నిలదీశారు మంత్రి కేటీఆర్.