Huzurabad Politics: కేటీఆర్ స్కెచ్.. హుజూరాబాద్ బరిలో కౌశిక్ రెడ్డి!

ఈటల రాజేందర్‌పై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పరోక్షంగా తెలియజేసినట్లే అనే చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 02:39 PM IST

మంగళవారం ఉమ్మడి కరీంనగర్ లోని జమ్మికుంట వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ (Etala Rajendar)పై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పరోక్షంగా తెలియజేసినట్లే అనే చర్చ జరుగుతోంది. కౌశిక్ రెడ్డి (Koushik Reddy)నే రాజేందర్‌పై పోటీకి నిలబెడతారనే సంకేతాలను మంత్రి కేటీఆర్ (KTR) ఇచ్చారని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో ఆయనను ఓడించడానికి ప్రయత్నించినా ఫలించలేదు. ఈ సారి హుజూరాబాద్ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఈటలకు సరైన ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డే అని కేటీఆర్ (KTR) భావిస్తున్నారు. రాబోయే 8 నెలలు ప్రజల్లోనే ఉండాలని కౌశిక్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.

గెల్లు శ్రీనివాస్ సమక్షంలోనే కేటీఆర్ ఈ మాటలు చెప్పడంతో అతడి అభ్యర్థిత్వం ఖరారే అనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జమ్మికుంట సభను కౌశిక్ రెడ్డి దగ్గరుండి విజయవంతంగా నిర్వహించారు. ఈ సారి కచ్చితంగా కౌశిక్ రెడ్డి గెలుస్తాడని కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు రెండు వర్గాలుగా బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేశారు. గత ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఒక వర్గంగా.. కాంగ్రెస్ నుంచి వచ్చి ఎమ్మెల్సీ అయిన పాడి కౌశిక్ రెడ్డి మరో వర్గంగా విడిపోయారు. ఇద్దరూ కలిసి పని చేస్తారని అధిష్టానం భావించినా.. ఉప ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఇరువురూ తమ బలం నిరూపించుకునే క్రమంలో పార్టీలో వర్గాలు తయారయ్యాయి. అంతే కాకుండా కౌశిక్ రెడ్డిని నియోజకవర్గానికి దూరంగా ఉండాలని అధిష్టానం కూడా సూచించింది.

ఈటలకు సరైన ప్రత్యర్థి కౌశిక్ రెడ్డే అని భావించినట్లు తెలుస్తున్నది. ఈటల దూకుడును తట్టుకోవాలంటే కౌశిక్ రెడ్డి అయితేనే బాగుంటుందని.. గెల్లు శ్రీనివాస్‌కు ప్రత్యామ్నాయం చూపిద్దామని భావించినట్లు చర్చ జరుగుతోంది. అందుకే జమ్మికుంట సభలో కౌశిక్ రెడ్డి పేరును కేటీఆర్ (KTR) ప్రకటించారని తెలుస్తున్నది. ఒకే దెబ్బకు హుజూరాబాద్‌లో వర్గపోరు తీర్చి, క్యాండిడేట్ పేరు చెప్పేశారు కేటీఆర్. దీనిపై స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై మరింత దూకుడుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ల వచ్చని అంటున్నారు. గత కొన్నాళ్లుగా తాను గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ (CM KCR) మీద పోటీ చేస్తానని ఈటల చెబుతున్నారు. కాగా, ఈటెల గజ్వేల్ నుంచి పోటీ చేసినా.. మరెక్కడి నుంచి పోటీ చేసినా.. హుజూరాబాద్ నుంచి మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Assembly Meetings: అసెంబ్లీ సమావేశాలు 9 రోజులు.. స్పీకర్ తో రెండు శాఖలు భేటీ!