KTR: అసంతృప్తికి కారణాలు చర్చించుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం!

  • Written By:
  • Updated On - January 9, 2024 / 01:39 PM IST

KTR: తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనం. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడం తో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయి. ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయాం. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదాం’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. వచ్చిన తెల్లారినించే మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని ఆ పార్టీ నెల రోజుల పోకడ స్పష్టమౌతున్నది. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలం లో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే’’ అని కేటీఆర్ సెటైర్స్ వేశారు.

‘‘1983 లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతర రాజకీయపరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పి ని తిరస్కరించి కాంగ్రెస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీ ని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవం మనం మరువగూడదు’’ అని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.