Site icon HashtagU Telugu

KTR Upset: తెలంగాణ బీజేపీ నేతలపై కేటీఆర్ కంప్లైంట్!

KTR

KTR

తెలంగాణ బీజేపీ నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకపడ్డారు.కుటుంబ సభ్యులను కించపరుస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా అంటూ బీజేపీ నాయకులని ప్రశ్నించారు.తీన్మార్‌ మల్లన్న ట్విటర్‌ వేదికగా చేసిన పోస్టుపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్‌ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఇదే నేర్పిస్తున్నారా అంటూ నడ్డాను కేటీఆర్‌ ప్రశ్నించారు.తన కుమారుడి శరీరాన్ని ఉద్దేశించి నీచంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సంస్కారమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక జాతీయ పార్టీ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సిగ్గుచేటని కేటీఆర్ తెలిపారు.

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేసే నేతలకు పార్టీ పెద్దలు బుద్ధిచెప్పాలని, ఇలాంటి వాఖ్యలు చేసేవారిపై లీగల్ గా ప్రొసీడ్ కావాల్సివస్తుందని కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేతలలాగా ప్రవర్తించే పరిస్థితి తమకు కల్పించవద్దని, సహనం నశించి తాము అలాగే చేయాల్సిన పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇతరులను విమర్శించేందుకు, వారిపై బురదజల్లేందుకు హక్కుగా మారిందన్న కేటీఆర్ సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో కొందరు యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా నిత్యం అర్థంలేని విషయాలను ప్రసారంచేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, తమ స్వార్థం కోసం చిన్న పిల్లలను కూడా ఇందులోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 

Exit mobile version