తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలపై విమర్శల జడివాన కురిపించారు. ఆయన మాట్లాడుతూ గతంలో హైదరాబాదును అభివృద్ధి దిశగా నడిపించిన పీజేఆర్ (పి. జనార్ధన్ రెడ్డి), మర్రి శశిధర్ రెడ్డి వంటి నాయకులు నగర అభివృద్ధికి బాటలు వేసారని గుర్తుచేశారు. వారిని “హైదరాబాద్ బ్రదర్స్”గా అభివర్ణిస్తూ, ఆ నాయకుల కృషి వల్లే నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని, హైదరాబాదును ముందుకు నడిపే బదులు వెనక్కి లాగుతున్న నేతలు రంగంలోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రస్తుత కాలంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న వారే నిజమైన బ్యాడ్ బ్రదర్స్ — కేటీఆర్, కిషన్ రెడ్డి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్ (RRR) వంటి కీలక ప్రాజెక్టులు నిలిచిపోయేందుకు వీరే కారణమని మండిపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చడానికి తాము ప్రయత్నిస్తున్నప్పుడు, రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే పనుల్లో అడ్డంకులు సృష్టించడం ద్వారా ఈ రెండు పార్టీలు నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం చూపుతున్నాయని రేవంత్ విమర్శించారు.
ఇంకా ఆయన బీఆర్ఎస్ నేతల అవినీతి, ప్రైవేట్ ఆస్తుల సేకరణను కూడా ప్రస్తావించారు. “కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వందల ఎకరాల ఫామ్ హౌసులు కట్టించుకున్నారు. ప్రజలకు గృహాలు ఇవ్వకపోయినా, తమకు మాత్రం ఎకరాల కొద్దీ భూములు సొంతం చేసుకున్నారు” అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు పెరగాల్సిన సమయంలో బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, నిరుద్యోగ యువతను మోసం చేశారని అన్నారు. చివరగా, ప్రజలు ఈసారి కపట రాజకీయాలకు ముగింపు పలికి, నిజమైన అభివృద్ధిని కోరుకునే నాయకులను ఎన్నుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు.
