Formula E Race Case : తెలంగాణ భవన్ లో ఈరోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫార్మాలా ఈ రేసు కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా – ఈ వ్యవహారంలో ఒక్కపైసా అవినీతి జరగలేదని.. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ తప్పు అన్నారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఈ కేసులో హైకోర్టు తీర్పు ఏం వస్తుందో చూద్దామన్నారు. ఈకేసులో ఈడీ ఎదుట ఈనెల 7న హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని తెలిపారు. రూ. 600 కోట్ల సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని.. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు అడ్వొకేట్ జనరల్ దగ్గర సమాధానమే లేదన్నారు. తనపై కేసు పెడితే సీఎం రేవంత్ రెడ్డిపైనా కేసు పెట్టాల్సిందేనన్నారు. రేవంత్ రెడ్డి తనను అరెస్టు చేయించడానికి ఏడాది కాలంలో ఇది ఆరో ప్రయత్నమని.. అయినా ఆయనకు ఏమీ దొరకడం లేదన్నారు. ఫార్ములా – ఈ వ్యవహారంలో ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఫార్ములా-ఈ రేసుకు తాను మంత్రిగా అనుమతిస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారు. నేను తప్పు చేస్తే రేవంత్‌రెడ్డి చేసింది ఎలా ఒప్పు అవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు.
కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు ఎదురయ్యే చిన్న, చిన్న అడ్డంకులను అధిగమించి లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కేటీఆర్ అన్నారు. కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. ఎండాకాలంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, కేసీఆర్ ను పార్టీ అధ్యక్షుడిగా తానే ప్రతిపాదిస్తానని తెలిపారు.
Read Also: రైతులకు న్యూఇయర్ గిఫ్ అందించిన కేంద్రం.. రూ. 1350కే ఎరువు బస్తా!