KTR Vs Bandi: పొలిటిక‌ల్ `ట్విట్ట‌ర్` సంగ్రామం

తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ పాల‌నకు వ్య‌తిరేకంగా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర రెండో విడ‌త చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 03:46 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి, కుటుంబ పాల‌నకు వ్య‌తిరేకంగా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర రెండో విడ‌త చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ప్ర‌తిచోటా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్, క‌విత‌పై పలు అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్లు చేస్తూ జైలులో పెడ‌తామంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు సంద‌ర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఆరోప‌ణ‌ల‌పై మంత్రి కేటీఆర్ సీరియ‌స్ గా స్పందించారు.

ఫాంహౌస్ సిఎంగా కేసీఆర్ ను ఫోక‌స్ చేయ‌డాన్ని మంత్రి కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. దానికి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తొలి నుంచి ఉన్న భూముల్లో ఒక భ‌వ‌నం క‌ట్టుకంటే ఫాంహౌస్ అవుతుందా? అంటూ ప్ర‌శ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణ‌లు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా బండి సంజ‌య్ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను అభ్యంత‌ర‌పెడుతూ కేటీఆర్ మండిప‌డ్డారు. ఆధారాలు లేకుండా దుమ్మెత్తిపోయ‌డం మానుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ను జైలు పంపిస్తామంటూ బండి ప్ర‌చారం చేశారు. ఆ త‌రువాత దుబ్బాక‌, హుజురాబాద్ ఎన్నిక‌ల్లోనూ అదే ప్ర‌చారాస్త్రంగా ఉప‌యోగించారు. కాళేశ్వ‌రం, మిష‌న్ కాక‌తీయ‌, భ‌గీర‌థ త‌దిత‌ర స్కీమ్ ల‌న్నింటిలోనూ స్కామ్ లు ఉన్నాయ‌ని ఆరోపించారు. వాటి మీద విచార‌ణ చేస్తామ‌ని చెబుతూ వ‌చ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఆరోప‌ణ కూడా నిరూపించ‌లేని ప‌రిస్థితిలో బీజేపీ ఉంది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర‌లో కుటుంబ పాల‌న అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ మీద వ్య‌క్తిగ‌తంగా అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ప్ర‌జ‌ల్లో బ‌ద్నాం చేస్తోన్న బండి సంజ‌య్ పై మంత్రి కేటీఆర్ గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి సీరియ‌స్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా టీఆర్ఎస్ క్యాడ‌ర్ మాత్ర‌మే బండికి రిప్లైయ్ ఇచ్చేది. ఇప్పుడు నేరుగా మంత్రి కేటీఆర్ వార్నింగ్‌లకు దిగారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే న్యాయ‌ప‌ర‌మైన విచార‌ణ ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా సోష‌ల్ మీడియా వార్ త‌గ్గిపోతుందా? లేదా న్యాయ‌ప‌ర‌మైన పోరాటం ప్రారంభం అవుతుందా? అనేది చూడాలి.