KTR: నీట్ ఎగ్జామ్ లో అవకతవకలపై విచారణ జరిపించాలి

  • Written By:
  • Updated On - June 8, 2024 / 09:40 PM IST

KTR: నీట్ (NEET) ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనితో తోడు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్ లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమన్నది సాధ్యమయ్యే పనికాదన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ‘గ్రేస్ మార్కులు’ ఇచ్చామని చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా ఎందుకు విడుదల చేయటం కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఐతే నీట్ ఎగ్జామ్ విషయంలో బీఆర్ఎస్ తరఫున పలు పశ్నలతో పాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచారు కేటీఆర్.

కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు, డిమాండ్లు.

1) గత 5 ఏళ్లలో తెలంగాణా నుంచి ఏ విద్యార్థి కూడా నీట్ (NEET) లో టాప్ 5 ర్యాకింగ్ లో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అక్రమాలే కారణమని మేము నమ్ముతున్నాం.

2) గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రామాణిక పద్దతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుంది. కానీ 1500 మంది విద్యార్థుల గ్రూప్ కు మాత్రమే మేలు చేసే విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. అది సరైన విధానం కాదు.

3) ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్ పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.