Site icon HashtagU Telugu

KTR : పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

KTR Tweet

KTR interesting tweet on the party changing leaders

KTR: ఉద్యమ పార్టీగా, తెలంగాణను సాధించిన పార్టీగా ఖ్యాతి గడించిన బీఆర్ఎస్(brs) పార్టీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు. పార్టీ కీలక నేత కె.కేశవరావు9(K. Kesha Rao) కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఎక్స్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్(kcr) అని కేటీఆర్ కొనియాడారు. ఒక్కడుగా బయల్దేరి, లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్ దని కితాబునిచ్చారు. అలాంటి ధీరుడు కేసీఆర్ ను కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెపుతారని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి… తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు. పార్టీలో నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాటపంథాలో కదం తొక్కుదామని ఆయన పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ద్రోహపు ఎత్తుగడలతో తమను ఆపలేరని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొగల సత్తా తమ పార్టీకి ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసాయిచ్చారు.

Read Also: Car Accident : జమ్ములో లోయలో పడిన కారు.. 10 మంది మృతి