Site icon HashtagU Telugu

KTR House Arrest: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేప‌థ్యంలో కేటీఆర్ హౌస్‌ అరెస్ట్‌!

KTR revanth

KTR revanth

KTR House Arrest: కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడి చేసిన నేప‌థ్యంలో పోలీసులు గ‌త రాత్రి ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద ఉన్న 10టీవీలో ఇంట‌ర్వ్యూ ముగించుకుని వ‌స్తున్న పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి క‌రీంన‌గ‌ర్‌కు త‌ర‌లించారు. ఈ అరెస్ట్ నేప‌థ్యంలో పోలీసులు క‌రీంన‌గ‌ర్ వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అయితే మంగ‌ళ‌వారం ఉద‌యం కౌశిక్ రెడ్దిని కరీంనగర్ కోర్టుకు కాకుండా జడ్జి ఇంటికి పోలీసులు త‌ర‌లించారు. రెండవ అదనపు జ్యుడీషియ‌ల్ మెజిస్ట్రేట్ ఇంటివద్ద ప్రవేశబెట్టారు. ప్ర‌స్తుతం వాదనలు కొన‌సాగుతున్నాయి.

కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ రియాక్ష‌న్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కొనసాగుతున్న కాంగ్రెస్ అణచివేతల పర్వం. ఇదేనా ప్రజా పాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?
కాంగ్రెస్ పార్టీ పిరాయింపులను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్ర‌మ అరెస్ట్‌! తమ చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు పూటకో అక్రమ కేసుతో.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టులు చేయడం అలవాటుగా మార్చుకున్నది రేవంత్ సర్కార్. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అణచివేతలకు దిగుతారా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం. పోరాటాలే ఊపిరిగా పుట్టి, ప్రజల పక్షాన నిలబడుతున్న గులాబీ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఎక్స్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

Also Read: Rohit Sharma: రంజీ ట్రోఫీలో ముంబై త‌ర‌పున ఆడ‌నున్న రోహిత్ శర్మ?

హ‌రీశ్ రావు స్పంద‌న‌

బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే మీద కేసులా?కెసిఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయం. ప్రశ్నిస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. ఆరు గ్యారంటీలు, హామీల అమలు, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎక్స్ వేదిక‌గా నిల‌దీశారు.

కేటీఆర్ హౌస్ అరెస్ట్‌

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ (KTR House Arrest) చేశారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని గ‌త రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.