KTR – Revanth : రేవంత్ రెడ్డి ని దించాలంటే ఏంచేయాలని ప్రజలు అడుగుతున్నారు – కేటీఆర్

KTR - Revanth : లగచర్ల రైతుల అరెస్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌ మండిపడ్డారు. సామాన్య రైతులతో పాటు సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు

Published By: HashtagU Telugu Desk
KTR Hot Comments

KTR Hot Comments

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించి రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు ఈ-కార్‌ రేస్‌ అంశంపైనా చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. “దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాలు విసిరారు.

లగచర్ల రైతుల అరెస్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌ మండిపడ్డారు. సామాన్య రైతులతో పాటు సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కొడంగల్‌ ప్రాంత రైతులు రేవంత్‌ రెడ్డికి ఓటేశామనే కారణంతో ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. నరేందర్‌ రెడ్డిని తుక్కుతుక్కుగా ఓడించే సత్తా ఉందంటూ, ఆయన ధైర్యానికి సెల్యూట్‌ చేయాలని ప్రజలను కోరారు.

రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల హామీగా చెప్పిన రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలవ్వలేదని విమర్శించారు. వానాకాలంలో రైతులకు భరోసా ఇవ్వకపోవడంతో పాటు బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కూడా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. “రాష్ట్రంలో ఒక్క ఊరిలో అయినా వందశాతం రైతు రుణమాఫీ చేసినట్లు చూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని సవాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ‘దొంగ హామీలు’గా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ఏడాది క్రితం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. “49 కోట్లు మాఫీ చేస్తామన్న హామీపై ఇప్పటి వరకు కేవలం 13 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు” అంటూ కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు. అంతేగాక, కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, వారంతా రేవంత్‌ రెడ్డిని పదవి నుండి దించేందుకు మార్గం అడుగుతున్నారని తెలిపారు.రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ నేతల హామీలు అబద్ధాలని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also : Congress : 19న కాంగ్రెస్‌ ఎంపీలతో రాహుల్‌గాంధీ భేటీ

  Last Updated: 17 Dec 2024, 07:45 PM IST