తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. సాగునీటి సమస్య, విద్యుత్ కోతలు, విత్తనాల లభ్యత సమస్యలు అన్నదాతల జీవితాలను కష్టతరం చేశాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎండా కాలంలో కూడా చెరువులు నిండుగా ఉండేవని, కానీ ఇప్పుడు అవి వెలవెలబోతున్నాయని మండిపడ్డారు. నాటి ప్రభుత్వ సహకారంతో రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకోగలిగారు కానీ, ఇప్పుడేమో ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లు అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. రైతులకు నిద్ర ఉండే విధంగా వ్యవసాయ అనుకూల విధానాలు అమలు చేశామని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇప్పటి వరకు 15 నెలల పాలనలో రైతుభరోసా నిధులు అందించలేదని, సాగునీటిని సమర్థంగా వినియోగించలేదని, పంటల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయం కష్టాల్లో ఉందని, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, అశ్వారావుపేట నుంచి జహీరాబాద్ వరకు రైతులు నష్టపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల జీవితాలు దుర్భరమవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరవు పెరిగిందని, రైతుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చితేనే రైతులకు మళ్లీ భరోసా కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.