KTR : సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం..కేటీఆర్‌

Rajiv Gandhi Statue: కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా రేపు (మంగళవారం) రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Published By: HashtagU Telugu Desk
KTR Fire on CM Revanth Reddy over Rajiv Gandhi Statue Issue

KTR Fire on CM Revanth Reddy over Rajiv Gandhi Statue Issue

Rajiv Gandhi Statue: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా రేపు (మంగళవారం) రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు..

కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణ తల్లి విగ్రహాం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సచివాలయం, అమర జ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాం ఉండాలని కేసీఆర్ 2023 జులైలోనే ఈ స్థలాన్ని ఎంపిక చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణను ఆత్మను తాకట్టు..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని తాము ముందునుంచే చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణను ఆత్మను తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనో భావాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందటమే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చర్యను యావత్తు తెలంగాణ సమాజం చీదరించుకుంటున్న సిగ్గు లేకుండా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలా? ఢిల్లీ బాసులా?..

తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా కాంగ్రెస్ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యమైపోయాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులామ్ లేనని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలా? ఢిల్లీ బాసులా? అంటే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ బాసులకే జీ హుజూర్ అంటారన్న విషయం మరోసారి స్పష్టమైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అస్తితత్వం తో పెట్టుకున్న వాళ్లెవరు రాజకీయంగా బతికి బట్టకట్టలేదని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు.

Read Also: Taliban Vs Polio : పోలియో వ్యాక్సినేషన్‌‌పై తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఏం చేశారంటే..

  Last Updated: 16 Sep 2024, 07:11 PM IST