KTR Controversy: కేటీఆర్ ట్వీట్ తో వివాదం ముగింపు..!!

ఏపీ పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 12:26 AM IST

ఏపీ పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ మంత్రులు సైతం ఈ వ్యాఖ్యలపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కాగా పరిస్థితి ఇలా ఉంటే మంచిది కాదని, మంత్రి కేటీఆర్ తాజాగా ట్వీట్ చేస్తూ, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. తాజా ట్వీట్ లో ఆయన ఇలా పేర్కొన్నారు..- ఈరోజు ఒక మీటింగ్‌లో నేను చేసిన వ్యాఖ్య ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చు. నేను AP CM జగన్ తో గొప్ప సోదర భావం ఉన్నందుకు ఆనందిస్తున్నాను, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అంటూ ముగించారు.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పార్టీల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే సీఎం కేసీఆర్ కూడా జగన్ పట్ల సానుకూలంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక విధంగా ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ఇరుకున పెట్టేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే కరెంటు కోతలు, రోడ్ల అధ్వాన్న పరిస్థితులు వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దీనిపై అటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు.

ఈ సమయంలో కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభిస్తూ, ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో ప్రధానంగా “తన మిత్రుడొకరు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలోని సొంతూరికి వెళ్లారని అక్కడికి వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి.. ఇక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి. అంతా అన్యాయంగా అధ్వానంగా ఉంది.. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లుందంటూ.. కొంతమంది నాలుగు బస్సుల్లో ఏపీకి పంపితే తెలంగాణలో ఎంత చక్కగా ఉందో అర్థమవుతుంది” అంటూ ఆయన చెప్పినట్లు కేటీఆర్ వివరించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేగింది.